హనీట్రాప్ తో ఎర..ఆపై లైంగిక దాడి..పోలీస్ కస్టడీలో పవన్ కుమార్ సంచలన విషయాలు 

హనీట్రాప్ తో ఎర..ఆపై లైంగిక దాడి..పోలీస్ కస్టడీలో పవన్ కుమార్ సంచలన విషయాలు 

వెలుగు: హైదరాబాద్‌లో అమ్మాయిల పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి యువకులను హనీట్రాప్‌కు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండబత్తుల పవన్ కుమార్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువకులతో సన్నిహితంగా మెలిగి, వారి వ్యక్తిగత వీడియోలను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

విచారణలో భాగంగా ఓ ప్రముఖ యూనివర్సిటీకి చెందిన బీటెక్ విద్యార్థిని లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట ప్రాంతంలో అతడితో కొంతకాలం ఒకే గదిలో ఉన్నట్లు తెలిసింది. అనంతరం వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, బాధితుడి కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించి రూ.4 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

82 మంది బాధితులు.. పోలీసులపైనా అనుమానాలు

యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పవన్ కుమార్‌ (23)ను సైదాబాద్ పోలీసులు గత సోమవారం అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 29 వరకు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. 

నకిలీ సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా బాధితుల వివరాలను సేకరిస్తున్న పోలీసులు, నిందితుడి నుంచి మూడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకుని వాటిలోని వీడియోలను పరిశీలిస్తున్నారు.

ఇప్పటివరకు గుర్తించిన 82 మంది బాధితుల్లో కొందరు పోలీసు సిబ్బంది కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన యువకులతోనూ నిందితుడు పరిచయాలు పెంచుకున్నట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయి.

13 ఇన్‌స్టాగ్రామ్, 14 ఫేస్‌బుక్ ఖాతాలు

నకిలీ ప్రొఫైళ్ల ద్వారా యువకులను పరిచయం చేసుకుని, వారిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు సృష్టించినట్లు భావిస్తున్న 13 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, 14 ఫేస్‌బుక్ ఖాతాల ఆధారంగా మరింత మంది బాధితులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం.